కొవ్వు భూతం మన శరీరంలోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయంలో పేరుకుపోతోంది. దారితప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు… మద్యం కావచ్చు.. కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయంలో పొరలు పొరలుగా తిష్ట వేస్తోంది. దాని వల్ల మన శరీర ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పడు (ఫ్యాటీ లివర్ తలెత్తే సమస్యలు ఏంటి? వాటికి సంబంధించి చికిత్స ఎలా ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయంపై కొవ్వు పేరుకు పోవడానికి కారణాలు ఏంటి?
తగినతంత వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. ఆ కొవ్వే కాలేయంలో నిల్వ అవుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు.. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్లలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. వీళ్లలో కొవ్వును జీర్ణం చేసే పద్ధతులు మారిపోతాయి. అలాగే మధుమేహం ఉన్నవాళ్లు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడేవాళ్లలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాకుండా గర్భనిరోధక మాత్రలు వాడటంవల్ల కూడా కాలేయంలో కొవ్వు ఏర్పడుతుంది.
కాలేయంపై కొవ్వు చేరినపుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి?
కడుపులో కుడిభాగంలో బరువుగా అనిపించడం ఒక లక్షణం. చిన్నగా కడుపునొప్పి వస్తుంది. అయితే చాలా మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. వందలో అయిదుగురికి మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల దాని పరిమాణం పెరుగుతుంది. దాని వల్ల కాలేయం మీద ఉండే గ్లిస్సన్ క్యాప్సుల్ అనే పొర సాగిపోతుంది.
ఫ్యాటీ లివర్ దశలు ఎలా ఉంటాయి?
మొదటి దశ ఫ్యాటీ లివర్. ఇది స్కాన్ చేస్తే కనిపిస్తుంది. రక్త పరీక్షలు చేస్తే సాధారణ ఫలితాలు వస్తాయి. రెండో దశను నాష్ అంటారు. దీనిలో ఎమ్మార్ ఎలాస్టోగ్రఫీ, ఫైబ్రో స్కాన్ మొదలైన అధునాత పద్ధతుల ద్వారా కాలేయం పనితీరును పరీక్షిస్తారు. కొవ్వు కాలేయాన్ని ఎంతవరకూ దెబ్బతీసిందని తెలుసుకోవడానికి ఈ పద్ధతులు ఉపయోగిస్తారు. కాలేయం పనితీరును బట్టి ఎఫ్ 0 నుంచి ఎఫ్ 4 వరకూ స్కోరింగ్ ఇస్తారు. ఈ పరీక్షల్లో ఎఫ్4 ఫలితం వస్తే వాళ్లు మూడో దశకు చేరుకున్నట్టు. మూడో దశను లివర్ ఫైబ్రోసిస్ అంటారు. లివర్ ఫైబ్రోసిస్ చాలా ప్రమాదకరం. నాలుగో దశలను సిరోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం పూర్తిగా చెడిపోతుంది. ఈ దశకు చేరుకున్నవాళ్లు 20 నుంచి 30 శాతం వరకూ చనిపోయే ప్రమాదం ఉంది.
కాలేయంపై కొవ్వు చేరడం వల్ల తీవ్రస్థాయి సమస్యలేమైనా ఎదురవుతాయా?
దీని వల్ల హార్ట్ ఎటాక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిరోసిస్, లివర్ కేన్సర్ వంటివి తీవ్రమైన సమస్యలు.
ఫ్యాటీ లివర్‌ను ఎలా నిర్ధారిస్తారు?
అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చు. దీని వల్ల కాలేయం ఎంత మేర కొవ్వు పేరుకు పోయిందో తెలుసుకోవచ్చు. అయితే కొవ్వు పెరిగనంత మాత్రాన రెండో దశకు చేరుకున్నట్టు కాదు. రెండో దశను గుర్తించాలంటే రక్త పరీక్ష, లివర్ ఫంక్షన్, లిక్విడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మూడు, నాలుగు దశలను ఎమ్మార్ ఎలాస్టోగ్రఫీ, ఫైబ్రో స్కాన్ వంటి అధునాతన పద్ధతుల ద్వారా లివర్ పనితీరును తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.
కాలేయంపై కొవ్వు చేరినప్పుడు ఎలాంటి చికిత్స చేస్తారు?
మొదటి దశలో ఉన్నవాళ్లు మందులు వాడటం కన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. వీళ్లు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. అలాగే క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తీపి పదార్థాలు, నూనెతో చేసిన పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. రెండో దశకు చేరుకున్న వాళ్లు పై జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. మూడు నాలుగు దశల వారికి తప్పని సరిగా మందులు వాడాల్సిందే. అయితే కొందరికి కాలేయం పూర్తిగా చెడిపోతుంది. అలాటప్పుడు మరో కాలేయాన్ని అమర్చాల్సి ఉంటుంది.